Feeds:
Posts
Comments

Archive for the ‘sri sri’ Category

మహాప్రస్థానం
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!

పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ
పదండి పోదాం,
వినబడలేదామరో ప్రపంచపు జలపాతం?

దారి పొడుగునా గుండె
నెత్తురులుతర్పణచేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీ నదాలూ,అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
“హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!” అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘూశావలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!

పదండి,
పదండి,
పదండి ముందుకు,
కనబడలేదా మరో
ప్రపంచపుకణకణమండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి
పడుతున్నవిఎనభై లక్షల మేరువులు
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమా,
నయాగరావలె
ఉరకండీ, ఉరకండీ ముందుకు
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగభుగలు?
-o0o-

Advertisements

Read Full Post »